_*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*కార్తీక మాసం మహత్యం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.
శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.
పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.
అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.
మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.
దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.
*కార్తీక వ్రతవిధానం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.
వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.
*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*