Wednesday, March 16, 2022

తిరుమలలో ప్రాచీన ముఖ్యమైన తీర్థములు!

తిరుమలలో ప్రాచీన ముఖ్యమైన తీర్థములు!

1. పాండవ తీర్థము : కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.

2. సనకసనందన తీర్థము : సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.

3. కుమారధారా తీర్థము : మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

4. తుంబుర తీర్థము : ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.

5. నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

6. చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

7. జాబాలి తీర్థము : ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.

8. బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.

9. వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.

10. శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.

11. సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.

12. యుద్ధగళ తీర్థము : ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.

13. విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో9 పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

14. పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.

ఇవే కాక కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.

Courtesy by 
V2URS solution
Suresh
9840344634

No comments:

Post a Comment

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...