Thursday, July 22, 2021

స్వర్గం వద్దన్న ముని కథ వినితీరాల్సిందే

**స్వర్గం వద్దన్న ముని కథ వినితీరాల్సిందే!*

పూర్వం ముద్గలుడనే బ్రాహ్మణుడు ఉండేవారు. పొలంలో మిగిలిన వడ్ల గింజలను ఏరుకుంటూ, ఎవరన్నా దాతలు ధాన్యాన్ని దానం చేస్తే స్వీకరిస్తూ అతను కాలం గడిపేవాడు. ముద్గలుడు పేదవాడే కావచ్చు. కానీ సత్యాన్నే నమ్ముకున్న నీతపరుడు. లేనివాడే కావచ్చు, కానీ తనకి ఉన్నదాన్ని అతిథులతో పంచుకునే ఉదారహృదయుడు. పైగా ముద్గలుడు పక్షపవాసం అనే వ్రతాన్ని చేసేవాడు. అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ ఉపవాసం ఉండి అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో మాత్రమే ఆహారాన్ని భుజించేవాడు.

ముద్గలుని సత్యనిష్ట నానాటికీ ముల్లోకాలలోనూ వ్యాపించసాగింది. సాక్షాత్తు దుర్వాసమహర్షే, ముద్గలుని సంకల్పం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఒక యాచకుని వేషంలో ముద్గలుని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు ముద్గలుడు ఉపవాస దీక్షని విరమించి భోజనం చేసే సమయం.

ముద్గలుడు ఆహారాన్ని ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో... ఇంటి ముందర యాచకుడు కనిపించాడు. ఒంటి మీద సరిగా గుడ్డయినా లేకుండా, జడలు కట్టేసి, క్రోధమే ఆయుధంగా ఉన్న ఆ యాచకుని చూసి ముద్గలుడు సాదరంగా ఆహ్వానించాడు. తన ఇంట్లో ఉన్న ఆహారాన్ని అతని ముందు ఉంచాడు. దుర్వాసుడు ఆ ఆహారాన్ని తిన్నంత తిన్నాడు, మిగిలిందంతా ఒంటికి పూసుకున్నాడు. ఆపై తన దారిన తను చక్కా పోయాడు. ముద్గలుడు ఆ పదిహేనవ రోజున కూడా నిరాహారంగా మిగిలిపోయాడు.

ముద్గలుడు ప్రతి పక్షానికీ తన ఉపవాసాన్ని విరమించేందుకు సిద్ధపడటం. అదే సమయంలో ఆ ఉన్మత్తుడు వచ్చి తిన్నంత తిని, మిగతాది నేలపాలు చేసి పోవడం! ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.... ఆరు సార్లు జరిగింది. చివరికి దుర్వాసుడు, ముద్గలునికి తన నిజరూపంలో దర్శనిమిచ్చాడు. ‘ముద్గలా నీ ఆతిథ్యం, ఉపవాసవ్రతం అసాధారణమైనవి. నీ వ్యక్తిత్వం ఇంత ఉన్నతమైనది కాబట్టే నువ్వు ఇన్నాళ్లుగా ఆకలిని కూడా తట్టుకుని జీవించగలిగావు. నీ దీక్షకు మెచ్చాను. నీకు స్వర్గలోకప్రాప్తిని అనుగ్రహిస్తున్నాను,’ అంటూ వరాన్ని అందించి వెళ్లిపోయాడు.

దుర్వాసుడు వరం ఇచ్చినట్లుగానే కొన్నాళ్లకి దేవదూతలు ముద్గలుని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. ముద్గలుని దేవవిమానంలో కూర్చోమంటూ ఆహ్వానించారు. ‘స్వర్గానికి వెళ్తాం బాగానే ఉంది. అక్కడి మంచిచెడులు ఏమిటో నాకు ఒక్కసారి తెలియచేయండి,’ అని దేవదూతలను అడిగాడు ముద్గలుడు.

ముద్గలుడు అడిగిందే తరువాయి దేవదూతలు స్వర్గం వైశాల్యం గురించీ, అక్కడి అందచందాల గురించీ, సౌకర్యాల గురించీ తెగ వర్ణించారు. అక్కడ అందాలే తప్ప ఆకలిదప్పులు ఉండవనీ, సుఖాలే తప్ప రోగాలు ఉండవనీ ఊరించారు. ఇదంతా విన్న ముద్గలుడు సాలోచనగా- ‘మీరు స్వర్గంలో కనిపించే సానుకూలతల గురించి చెప్పారు. మరి అక్కడ ఏమన్నా దోషాలు ఉన్నాయా?’ అని అడిగాడు.

ముద్గలుని ప్రశ్నకు దేవతూతలు కాస్త ఇబ్బందిపడుతూ- ‘భూమి మీద ఉన్నప్పుడు చేసిన పుణ్యాల వల్ల స్వర్గ ప్రాప్తి లభించింది కదా! అయితే అక్కడ మళ్లీ పుణ్యం చేసే అవకాశం ఉండదు. పైగా మీరు స్వర్గంలో సుఖాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఆ పుణ్యం తరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పుణ్యం పూర్తిగా తరిగిపోతుందో... తిరిగి ఈ భూలోకం మీద జన్మించాల్సి ఉంటుంది. అలా స్వర్గాన్ని వీడే సమయంలో మనసు వేదన చెందక మానదు. పైగా భూలోకంలో తిరిగి జన్మించకా తప్పదు!’ అని చెప్పుకొచ్చారు.

దేవదూతల మాటలు విన్న ముద్గలుడు ఆశ్చర్యపోయాడు. ఆపై కాసేపు ఆలోచించి... ‘అయ్యా! ఈ స్వర్గమేదో మళ్లీ సంసారబంధాన్ని కలిగించేదిగానే ఉందికదా! పుటుక, చావుల చక్రంలోకి మళ్లీ దించేదిగానే ఉందికదా! అబ్బే నాకు అలాంటి స్వర్గం వద్దుగాక వద్దు. ఎప్పటికీ సంసారంలోకి రాని జన్మరాహిత్యమే నాకు కావాలి. ఇక మీదట అలాంటి మోక్షం కోసమే నేను సాధన చేస్తాను. దయచేసి మీరు వెళ్లిరండి,’ అంటూ ఆ దేవదూతలను పంపి వేశాడు.

అటుపై సన్యాసాన్ని స్వీకరించి తపస్సాధనలు చేసి మోక్షాన్ని సాధించాడు. తన సాధనలో తెలుసుకున్న విషయాలతో గణేశుని మహత్యాన్ని వివరంచే ముద్గల పురాణాన్ని, విష్ణుమూర్తిని ఆదిపురుషునిగా పేర్కొంటూ ముద్గల ఉపనిషత్తునీ రచించాడు.*

No comments:

Post a Comment

Need more forest in india for green environment

Need more forest in india for green environment. I request to government please set a policy compulsory a tree infront of house. Sets growin...